ఎందరో మహానుభావులు - ఏ దేశమేగినా ఎందు కాలిడిన


ఏ దేశమేగినా ఎందు కాలిడిన..

రచన - రాయప్రోలు సుబ్బారావు 

సేకరణ  - లాస్య రామకృష్ణ 


ఏ దేశమేగినా ఎందు కాలిడిన 
ఏ పీఠమెక్కినా, ఎవ్వరేమనినా 
పొగడరా నీ తల్లి భూమి భారతిని 
నిలుపరా నీ జాతి నిండు గౌరవము. 

ఏ పూర్వ పుణ్యమో, ఏ యోగ బలమో
జనియించినాడా వీ స్వర్గఖండమున 
ఏమంచి పూవులన్ ప్రేమించినావో 
నిను మోచె ఈ తల్లి కనక గర్భమున 

లేదురా ఇటువంటి భూదేవి యెందు 
లేరురా మనవంటి పౌరులింకెందు 
సూర్యుని వెలుతురుల్ సోకునందాక 
ఓడల జండాలు ఆడునందాక 

అందాకగల ఈ అనంత భూతలిని 
మన భూమివంటి చల్లని తల్లి లేదు 
పాడరా నీ తెల్గు బాల గీతములు 
పాడరా నీ వీర భావ భారతము 

తమ తపస్సులు ఋషుల్ ధారవోయంగ
శౌర్య హారము రాజచంద్రులర్పింప 
భావ సూత్రము కవిప్రభువులల్లంగ 
రాగ దుగ్ధము భక్తరత్నముల్ పిదుక 

దిక్కుల కెగదన్ను తేజమ్ము వెలుగ 
రాళ్ల తేనియలూరు రాగాలు సాగ 
జగముల నూగించు మగతనం బెగయ 
సౌందర్య మెగబోయు సాహిత్యమలర 

వెలిగినదీ దివ్యవిశ్వంబుపుత్ర 
దీపించె నీ పుణ్య దేశంబు పుత్ర 
పొలముల రత్నాలు మొలిచెరా యిచట 
వార్ధిలో ముత్యాలు పండేరా యిచట 

పృధివి దివ్యౌషధుల్ పిదికెరా మనకు 
కానల కస్తూరి కాచేరా మనకు 
అవమానమేలరా? అనుమానమేలరా 
భారతీయుడనంచు భక్తితో పాడ 

--------------
ఈ సంచికలోని ఇతర రచనలు 

ముఖచిత్రం













1 comment:

  1. మహానుభావుల గుఱించి తెలుసుకోవటం తప్ప వారి గురించి కమెంట్లు వ్రాసే స్థాయి కాదని తెలియచేసుకొంటున్నాను .

    ReplyDelete